అందుకే నన్ను చంపుతున్నాడు.. అని వివేకా లేఖలో ఉందట! - MicTv.in - Telugu News
mictv telugu

అందుకే నన్ను చంపుతున్నాడు.. అని వివేకా లేఖలో ఉందట!

March 15, 2019

వైఎస్ వివేకానందది అనుమానాస్పద మృతి కాదని, హత్య అని పోలీసు ప్రాధమిక నిర్ధారణకు రావడం తెలిసిందే. అయితే అంతకు ముందు ఆయనది సహజ మరణమేనని పోలీసులు తమను నమ్మించడానికి యత్నించారని వైఎస్ జగన్, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివేకా కుమార్తె సునీత ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Kadap sp Rahul gives details about viveka letter before his murder driver.

వివేకా హత్యకు ముందు ఒక లేఖ రక్తంతో రాశారని, అందులో ఆయన డ్రైవర్ పేరు ఉందని పోలీసులు తమకు చెప్పినట్లు జగన్ అన్నారు. హత్యకు గురవుతున్న వ్యక్తి రక్తంతో లేఖ ఎలా రాస్తారని, ఈ కేసులో డ్రైవర్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘మా చిన్నాన్నను చంపి ఆయనే ప్రమాదవశాత్తు చనిపోయినట్టు నమ్మించాలని యత్నిస్తున్నారు. ఆయన రక్తం కక్కుకుని పడిపోయినట్టు నమ్మించాలని, కమోడ్ గుద్దుకుని ప్రాణాలు వదిలినట్టు చిత్రీకరించాలని ప్రయత్నించారు. బాబాయ్ రక్తంతో లేఖ రాసినట్టు అక్కడే ఓ లేఖను పుట్టించారు. ఆ లేఖలో డ్రైవర్ పేరు పెట్టి అతడే తన మరణానికి కారణమని అనుమానాలు వచ్చేలా కుట్ర పన్నారు. డ్రైవర్ మీద నేరం మోపుతున్నట్టు ఆ లేఖలో రాసింది హంతకులే. మా చిన్నాన్న చావుబతుకుల్లో ఉండి ఆ లేఖ రాశాడా? హంతకులు చూస్తుండగానే తన రక్తంతోనే తాను లేఖ రాశాడా?’ అని జగన్ ప్రశ్నించారు. అంతేకాకుండా, కడప ఎస్పీ రాహుల్ దేవ్‌తో తాను మాట్లాడుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఏడీజీ పలుమార్లు ఆయనకు ఫోన్ చేశారని, అంత అవసరం ఏముందని ప్రశ్నించారు.

జగన్ ఆరోపణ తర్వాత ఎస్పీ రాహుల్ మాట్లాడుతూ లేఖపై వివరణ ఇచ్చారు. వివేకా వద్ద ఒక లేఖ దొరికిందని, అయితే అది పెన్నుతో రాశారని, వివేకా రక్తం దానికి అంటుకుందని చెప్పారు. లేఖలో ఏముందని అడగ్గా.. ‘డ్రైవర్‌ను తొందరగా పిలిచాను.. అందుకే నన్ను చంపుతున్నాడు.. ’ అని ఉందన్నారు. ఈ కేసులో డ్రైవర్‌పై అనుమానముందా అని అడగ్గా దర్యాప్తు తర్వాత చెబుతామన్నారు. లెటర్ ప్రస్తుతం జగన్ ఫ్యామిలీ తమకు ఇచ్చిందన్నారు. దాన్ని వివేకా రాశారో లేదో విచారణ చేస్తున్నామన్నారు.