మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఆయన హత్య వెనక కడప వైకాపా ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని, నంబర్ టూ నిందితుడు సునీల్ ఘటనకు ముందు, తర్వాత అవిశాన్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని చార్జిషీటు దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ మరోసారి ఎంపీని పిలుపించుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లో అవినాశ్ రెడ్డిని విచారించింది. రూ. 40 కోట్ల సుపారీ డీల్‌పై సీబీఐ అధికారులు ఆయనను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నివారాల కిందట కూడా అవినాశ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. విచారణ సమయంలో తన పక్కన లాయర్లు ఉండాలన్న ఆయన వినతిని తోసిపుచ్చింది.
కాగా, ఈ కేసులో సీబీఐ విచారణ నిష్పాక్షికంగా జరగడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘‘వివేకానంద రెడ్డికి ఏవో ఇంటి సమస్యలు ఉన్నాయి. హత్యకు, రెండో పెళ్లికి సంబంధముందని అప్పట్లో వార్తలు రాశారు. ఆయన చుట్టూ ఉన్నవాళ్లే ఆయన చంపేశారు. అది జరిగింది చంద్రబాబు హయాంలో. దర్యాప్తులో ఇవన్నీ పట్టించుకోవడం లేదు. వివేకా ఫోన్‌లోని డేటా రికార్డులను ఎందుకు డిలీట్ చేశారు? ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఫోన్ రికార్డును ఎందుకు పట్టించుకోలేదు. మా ఎంపీ అవినాశ్ రెడ్డికి ఈ హత్యతో సంబంధమే లేద. జగన్ పరువును మంటగలిపే కుట్ర జరుగుతోంది.’’ అని సజ్జల అన్నారు.