వైఎస్ వివేకా హత్య కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. విచారణ కోసం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ నోటీసులు పంపించడం మరోసారి ఆసక్తి రేపింది. సీబీఐ నోటీసులకు స్పందించిన అవినాశ్ రెడ్డి తాను ప్రస్తుతం విచరాణకు హాజరుకానని తిరిగి లేఖ రాశారు. నేడు (మంగళవారం) పులివెందులలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనవల్సి ఉందని చెప్పారు. ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలు కారణంగా ప్రస్తుతం రావడం కుదరదని లేఖలో పేర్కొన్నారు. ఒక రోజు ముందుగా నోటీసు పంపడతో ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని.. 5 రోజుల తర్వాత సీబీఐ ఎప్పుడు పిలిచినా హాజరవుతానంటూ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే మరోసారి విచారణ తేదీ తెలియజేయాలని లేఖలో ఆయన కోరారు.దీనిపై సీబీఐ స్పందించాల్సి ఉంది.
వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు సోమవారం కడప , పులివెందులకు వెళ్లి పలువురిని విచారించారు. అలాగే పులివెందుల వైసీపీ కార్యాలయానికి వెళ్లిన అధికారులు అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయంతో పాటు తండ్రి భాస్కర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారు. భాస్కర్‌రెడ్డి కార్యాలయానికి రాలేదని పార్టీ కార్యకర్తలు చెప్పడంతో వారు వెనుదిరిగారు. ఈ క్రమంలోనే వివేకా హత్య కేసులో విచారణకు రావాల్సిందిగా కడప ఎంపీకి నోటీసులు జారీ చేసింది సీబీఐ. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులో సీబీఐ పేర్కొంది.