నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ శుక్రవారం అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. 60 ఏళ్ల నటజీవితంలో అన్ని రకాల పాత్రలను పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ముఖ్యంగా యమధర్మరాజు పాత్ర అయితే నభూతో నభవిష్యత్ అన్నట్టు ఉంటుంది. హావభావాలు, డైలాగ్ డెలివరీ, ఆహార్యం, అంగీకం వంటివి ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే మహేశ్ బాబు మహర్షి సినిమానే కైకాలకు చివరి సినిమా అనుకున్నారు. కానీ కాదు. ఆయన నటించిన చివరి చిత్రం ‘దీర్ఘాయుష్మాన్ భవ’. ఇందులో కూడా యమధర్మరాజుగా నటించారు. కార్తీక్ రాజు, మిస్త్రీ చక్రవర్తి జంటగా నటించిన ఈ సినిమాకు పూర్ణానంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేయాలని భావించగా, ఆ లోపే కైకాల కాలం చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ స్పందిస్తూ కైకాల చేతుల మీదుగా ట్రైలర్ లాంఛ్ చేసి జనవరిలో విడుదల చేయాలనుకున్నామన్నారు. కానీ ఇంతలోనే ఇలా జరిగిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని ఆయనకే అంకితం చేస్తామని నివాళులు అర్పించారు.