టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించారు. కైకాల పెద్ద కుమారుడు లక్ష్మి నారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియల్లో చిరంజీవి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు పాల్గొన్నారు. అంతకుముందు ఫిల్మ్ నగర్‌లోని కైకాల నివసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. పెద్ద ఎత్తున అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని తమ అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.
గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కైకాల మృతి తెలుగు సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కైకాల సత్యనారాయణ చివరి చూపు కోసం సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. కైకాల భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చిరంజీవి, పవన్ , వెంకటేష్, మోహన్‌బాబు వంటి నటులు ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు.
60 సంవత్సరాల సినీజీవితంలో కైకాల 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సత్యనారాయణ నటించారు. ఆయన వేసిన యుముడి పాత్రలు చరిత్రలో నిలిచిపోయాయి.