తెలుగు ప్రేక్షకులు అభిమాన తార కాజల్ అగర్వాల్ పెళ్లి ఘనంగా జరిగిపోయింది. ముంబై బంధుమిత్రుల సమక్షంలో కల్యాణ తంతు పూర్తయింది. ఫొటోలు కూడా ఒకటొకటే వచ్చేస్తున్నాయి. తాజ్ ప్యాలెస్ స్టార్ హోటల్ ఆమె పెళ్లికి వేదికైంది. మెహందీ, హల్దీ ఫొటోల్లో పెళ్లికళ ఉట్టిపడుతున్న ‘చందమామ’ను చూసి అభిమానులు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాజల్ తన ప్రియుడు, ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడుతున్నట్లు హఠాత్తుగా ప్రకటించి షాకివ్వడం తెలిసిందే. అంతకు ముందు.. అబ్బే, ఇప్పుడే పెళ్లేంటన్న సుందరాంగి ఇదే సరైన సమయమని పెళ్లిపీటలెక్కేసింది. పెళ్లయిన తర్వాత తాను నటిస్తానని ఆమె బల్లగుద్ది చెప్పేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో చిరంజీవి ‘ఆచార్య’తో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి.