భారతీయ మేధస్సు మరోసారి ప్రపంచం ముందు అగ్రభాగాన నిలిచింది. అత్యంత క్లిష్టమైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ టెస్టులో ఢిల్లీ ఐఐటీ విద్యార్ధి కలశ్ గుప్తా మొదటి స్థానంలో నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది పాల్గొన్న ఈ పోటీలో మనకు మొదటి ర్యాంకు రాగా, రెండో స్థానంలో చిలీ వ్యక్తి, మూడో స్థానంలో తైవాన్ వ్యక్తి నిలిచాడు. దాదాపు 87 దేశాల నుంచి ఇంజినీర్లు ఈ కోడ్ విటా పోటీలో పాల్గొన్నారు.
విజేతకు పదివేల డాలర్ల ప్రైజ్ మనీని అందించారు. ఈ విషయాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ప్రకటించింది. కలశ్ గుప్తా సాధించిన విజయం పట్ల ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు. తాజా విజయం సంస్థకు గర్వకారణమని కలశ్ గుప్తాను సత్కరించారు. కాగా, టీసీఎస్ సంస్థ కోడ్ విటా పేరుతో ఈ పోటీని నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ కోడింగ్ కాంపిటీషన్‌గా ఈ పోటీలు గిన్నీస్ రికార్డు సాధించింది.