టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఆయన ఈ ఏడాది నటించిన చిత్రం సర్కారు వారి పాట సినిమా మే 12న రిలీజవగా, కలెక్షన్ల పరంగా వంద కోట్ల క్లబ్బులో చేరింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, పాటలన్నీ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇందులోని కళావతి సాంగ్ బాగా ఫేమస్ అయ్యింది. చాలా మంది సెలబ్రిటీలు సైతం రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన కొరియోగ్రఫీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా కళావతి పాట ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన తెలుగు పాటగా రికార్డు సాధించింది. ఏకంగా 237 మిలియన్స్ వ్యూస్ రాగా, 2.5 మిలియన్ల లైకులను సాధించింది. దీని తర్వాత డీజేటిల్లు టైటిల్ సాంగ్ నిలిచింది. 218 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. అటు ఆల్బమ్స్ పరంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా నిలిచింది. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలోని పాటలు ఉత్తర, దక్షిణాది భాషల్లో కూడా హిట్ అవడంతో పాపులర్ ఆల్బంగా పేరు తెచ్చుకుంది.