కాళేశ్వరం ప్రాజెక్టుపై మరో శుభవార్త   - MicTv.in - Telugu News
mictv telugu

కాళేశ్వరం ప్రాజెక్టుపై మరో శుభవార్త  

November 24, 2017

తెలంగాణ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి  శుక్రవారం రెండవ దశ అనుమతించింది. నీటిపారుదల మంత్రి హరీశ్ రావు మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో జలవనరుల మంత్రి గడ్కారీ సహా పలువు కేంద్రమంత్రులతో, జల వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి అధికార యంత్రాంగంతో జరిపిన మంత్రాంగం ఫలించింది. ఈ ప్రాజెక్టును కోర్టు కేసులతో అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు ఇది చెంపపెట్టు అని నీటిపారుదల హరీశ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మిగతా విభాగాలు, మంత్రిత్వ శాఖల  నుంచి పెండింగులో ఉన్న  అనుమతులను కూడా త్వరితగతిన సాధించాలని ఆయన ఇరిగేషన్ ఉన్నతాధికారులను కోరారు.కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నుంచి వరుసగా వివిధ అనుమతులు వస్తున్నాయి. గత 15 రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్,  అంతర్రాష్ట్ర అనుమతి, కేంద్ర భూగర్భ జల శాఖ, కన్స్ట్రక్షన్ మెషినరీ అనుమతులు, వచ్చాయి. ప్రాజెక్టు పరిధిలో పర్యావరణ ప్రభావిత మదింపు అంచనాకు సంబంధించి టర్మ్ ఆఫ్ రిఫరెన్సు రావడంతో 13 జిల్లాల్లో  ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఇప్పటికే పూర్తయ్యింది.  అటవీ భూములకు సంబంధించి కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నుంచి మొదటి దశ అనుమతులు గతంలోనే వచ్చాయి.