కొత్త మేనమామ ఎవరో తెలుసా... - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త మేనమామ ఎవరో తెలుసా…

June 10, 2017

పిల్ల పెళ్లికొచ్చిందా…ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా…ఆర్థిక సమస్యలు ఉన్నాయా..టైమ్ కి రావాల్సిన పైసలు రాలేదా..డోంట్ వర్రీ.మీ కష్టాలు తీర్చేందుకు కొత్త మేనమామ వచ్చారు. మీరు పికర్ చేయొద్దు..ఇంతకీ ఆయనెవరు..మీ పిల్లకెట్లా మేనమామ అవుతాడని అనుకుంటున్నారా..

ఇంట్లో ఆడపిల్లలుంటే ఉంటే ఆ వెలుగే వేరు.నిత్యం సరదాల సంక్రాంతే. బిడ్డా పెరిగి పెద్దదై పెళ్లీడుకొస్తే…తల్లిదండ్రులకు టెన్షన్ మొదలవుతుంది. పెళ్లికి ఏం కూడబెట్టకపోతిమి…ఇప్పుడు పెళ్లి చేసి అత్తింటికి ఎట్లా పంపాలని తెగ ఆలోచిస్తుంటారు. ఎంతో కొంత జమచేసినా సరిపోతుందో లేదోనన్న కంగారు. పిల్ల మేనమామ ఏమైనా సాయం చేస్తాడన్న ఆశ ఎట్ల ఉండేది. మేనమామ కూడా బాధ్యతగా ఎంతో కొంత ఇచ్చేవాడు. రాను రాను కొన్ని కుటుంబాల్లో ఇది కూడా లేకుండా పోతోంది. అందుకే ఆందోళన వద్దంటున్నాడు కొత్త మేనమామ.. ఇంతకీ కొత్త మేనమామ ఎవరంటే తెలంగాణ సర్కార్. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. మేనమామలు సాయం చేసినా…చేయకపోయినా ఆడపిల్లలకు తెలంగాణ సర్కార్ మేనమామై దగ్గరుండి పెళ్లి జరిపిస్తుందన్నారు. కల్యాణ లక్ష్మి పథకంలో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు భరోసానిచ్చిందన్నారు.

కల్యాణలక్ష్మి,షాదీముబారక్ ద్వారా సర్కార్ చేస్తున్న సాయం పేద కుటుంబాలకు ఆసరా అవుతుందన్నారు కేటీఆర్.పేదింట్లో పుట్టిన ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారఖ్ పథకాల ద్వారా ఆర్ధిక భరోసాను కల్పిస్తోందని చెప్పారు.
ఆడబిడ్డలకు జీవితంలో మధురమైన ఘట్టం పెళ్లి. పేదరికంతో కష్టాల మధ్య ఈ వేడుక జరగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకమే కల్యాణలక్ష్మీ, షాదీముబారక్. 2014అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా వివాహం చేసుకునే యువతికి తల్తీ పేరుమీద రూ.51వేలను అందిస్తున్నారు. తొలుత దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకే ఈ పథకం వర్తించేది. తర్వాతికాలంలో బీసీలకు..అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా వర్తించేలా చేశారు. నిజంగానే సర్కార్ మేనమామ అయి పేదింటి పిల్లల పెళ్లిలు చేస్తుంది.ఇక ఆలస్యం ఎందుకు ఈ మేనమామను బాగా వాడుకోండ్రి…