తొలిసారి.. పర్లాకిమిడి సింహాసనంపై మహిళ - MicTv.in - Telugu News
mictv telugu

తొలిసారి.. పర్లాకిమిడి సింహాసనంపై మహిళ

January 20, 2020

Kalyani Devi.

ఓడిశాలోని పర్లాకిమిడి సంస్థాన సింహాసనాన్ని మొదటిసారి ఓ మహిళ అధిష్టించింది. రాణిగా యువరాణి కల్యాణీ దేవి గజపతికి ఆదివారం పట్టాభిషేకం జరిగింది. ఇంతవరకు దాదాపు 17 మంది రాజులు పర్లాకిమిడి సంస్థాన సింహాసనాన్ని అధిష్టించగా, ఇటీవల 17వ రాజు గోపీనాథ గజపతి మృతిచెందారు. దీంతో పర్లాకిమిడి సంస్థాన సింహాసనం ఖాళీ అయింది. గోపీనాథ గజపతికి కొడుకులు లేకపోవడంతో ఆయన కుమార్తె యువరాణి కల్యాణీదేవి గజపతికి పట్టాభిషేకం నిర్వహించారు.

1550లో తొలిసారిగా శివలింగ నారాయణదేవ్‌ రాజుగా పర్లాకిమిడి సింహాసనాన్ని అధిష్టించారు. ఆ తర్వాత వరుసగా 17 మంది పర్లాకిమిడి సంస్థానానికి రాజులుగా వ్యవహరించారు. ఈ నెల 22వ తేదీన రాజమందిరం వద్ద పెద్దఎత్తున అధికారికంగా కల్యాణీదేవి పట్టాభిషేకం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేరోజున అమర గోపీనాథ గజపతి చనిపోయి 12వ రోజు కూడా కావడంతో అంతా కలసివస్తుందన్న నమ్మకంతో పట్టాభిషేక కార్యక్రమానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంస్థానం రాణిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత యువరాణి కల్యాణీదేవి ఆస్థాన విధులను సక్రమంగా నిర్వహించి, రాజవంశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేడీ నాయకులు ప్రదీప్‌ నాయక్, వి.ఎస్‌.ఎన్‌.రాజు, బసంత్‌ దాస్, సంస్థానం ప్రముఖులు పాల్గొన్నారు.