తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ మళ్లీ మనుసు మార్చుకున్నారు. మూడు నెలల కింద రాజకీయాల కోసం సినిమాలను వదిలేస్తున్నట్టు ప్రకటించిన ఉదయనిధి.. తాజాగా సినిమాలో నటిస్తున్నట్టు వెల్లడించారు. కమల్ హాసన్ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్లో ఈ సినిమా ఉంటుందని ప్రకటించాడు. ఈ ప్రొడక్షన్లో ఇటీవల వచ్చిన విక్రమ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
ఈ మూవీని తమిళనాడులో ఉదయనిధి సంస్థ రెడ్ జాయింట్ మూవీస్ పంపిణీ చేసింది. ఈ సంస్థ స్థాపించి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించగా, కమల్ హాసన్ ముఖ్య అతిథిగా వచ్చారు. అదే వేదికపైన కమల్ హాసన్ ఉదయనిధి హీరోగా సినిమాను అనౌన్స్ చేశారు. దీంతో తనకు హీరోగా అవకాశమిచ్చిన కమల్ హాసన్‌కు ఉదయనిధి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు మహేశ్ నారయణ్ దర్శకత్వం వహస్తాడు. కాగా, పదేళ్ల క్రితం హీరోగా పరిచయమైన ఉదయనిధి.. కొన్ని అనువాద సినిమాలతో తెలుగులో కూడా మెరిశాడు. ఎమ్మెల్యే కూడా అయిన ఈయన త్వరలో మంత్రి పదవి చేపడుతాడని ఊహాగానాలు వచ్చాయి. వాటికితోడు సినిమాలను వదిలేస్తున్నట్టు ప్రకటించడంతో మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. ఇంతలో తాజా ప్రకటనతో అవన్నీ వట్టి పుకార్లేనని నిరూపణ అయినట్టయింది.