సూర్య అభిమానుల యవ్వారం... స్క్రీన్‌ను తగలబెట్టేశారు... - MicTv.in - Telugu News
mictv telugu

సూర్య అభిమానుల యవ్వారం… స్క్రీన్‌ను తగలబెట్టేశారు…

June 8, 2022

స్క్రీన్‌పై తమ అభిమాన హీరో కనబడితే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. పేపర్లు విసరడం, రూపాయి నాణేలు విసరడం.. అబ్బో.. ఆ అభిమానానికి హీరోలు కూడా ఒక్కోసారి భయపడుతుంటారు. అలాంటి భయానక ఘటన ఒకటి పుదుచ్చేరిలోని ఓ థియేటర్ లో జరిగింది. ఆ థియేటర్‌లో చాలా కాలం తర్వాత లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన చా విక్రమ్ సినిమా ప్రదర్శిస్తున్నారు. క్రేజీ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు ఆయన సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో క్యామియో రోల్ లో స్టార్ హీరో సూర్య కూడా నటించారు. సూర్యకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇంకేముంది… స్క్రీన్ మీద సూర్య కనబడగానే ఆయన అభిమానులు టపాకాయలు పేల్చారు. దాంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడి తెరకు అంటుకున్నాయి. దాంతో సినిమా రన్ అవుతుండగానే స్క్రీన్ మొత్తం కాలిపోయింది. థియేటర్ లో మంటలు ఎగసిపడటం తో ప్రేక్షకులు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అభిమానుల అత్యుత్సహానికి థియేటర్ స్క్రీన్ తగలబడిపోయింది. థియేటర్ యాజమాన్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది.