రామమందిరానికి రాజీవ్ ఇదివరకే శంకుస్థాపన చేశారు.. దిగ్విజయ్  - MicTv.in - Telugu News
mictv telugu

రామమందిరానికి రాజీవ్ ఇదివరకే శంకుస్థాపన చేశారు.. దిగ్విజయ్ 

August 3, 2020

Kamal Nath Welcomes Ram Temple Construction In Ayodhya, Digvijaya Says 'Rajiv Gandhi Wanted The Same'.

రామ జన్మభూమిలో మందిర నిర్మాణానికి ఎప్పుడో భూమిపూజ అయిందని.. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో అయోధ్యలో రామమందిర భూమి పూజకు అంతా సిద్ధమవుతున్న వేళ ఆయన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. మరోవైపు రామ మందిర నిర్మాణం జరగాలని రాజీవ్ గాంధీ కూడా కోరుకున్నారని ఇటీవల మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై రిపోర్టర్లు దిగ్విజయ్ సింగ్‌ను ప్రశ్నించగా.. రామ మందిర నిర్మాణానికి ఎప్పుడో భూమిపూజ జరిగిందని సంచలనానికి తెరదీశారు. ఆగస్టు 5న రామ మందిరం భూమిపూజకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా 50 మంది వీఐపీలు హాజరువుతారని తెలుస్తోంది. వీఐపీలు, ఆలయ పూజారులు, సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు కలిపి మొత్తం 200 మంది మాత్రమే పాల్గొంటారని సమాచారం. 

ఆరోజు కార్యక్రమంలో భాగంగా భూమిపూజకు ముందు మందిరంలోని రాముడి విగ్రహానికి  మోదీ పూజ చేస్తారు. అలాగే హనుమాన్‌ గిరి ఆలయంలోని హనుమంతుని పూజ కూడా చేస్తారు. అనంతరం మొత్తం రూ.326 కోట్ల ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ శుభకార్యం కోసం అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు నాలుగు లక్షల లడ్డూ ప్యాకెట్లు(ఒక్కో ప్యాకెట్లో నాలుగు లడ్డూలు) పంపి నోరు తీపి చేయనుంది. ఢిల్లీలోని అన్ని దేశాల ఎంబసీలతో పాటు అయోధ్యలోనూ స్వీట్లు పంచనున్నారు. ఇందుకోసం 16 లక్షల లడ్డూలను బికనేర్‌కు ఆర్డర్ చేశారు. లక్నో, ఢిల్లీలో వీటిని తయారు చేస్తున్నారు.