వానలొచ్చాయ్, గాడిదలొచ్చాయ్.. రైతన్నకు ఊరట..  - MicTv.in - Telugu News
mictv telugu

వానలొచ్చాయ్, గాడిదలొచ్చాయ్.. రైతన్నకు ఊరట.. 

October 19, 2020

Kamareddy District farmers used donkeys to transport grain.jp

మూగజీవాలు ఎప్పుడూ మనుషుల కోసం తమ జీవితాలనే త్యాగం చేస్తున్నాయి. ఎంతటి కష్టాన్ని అయినా అవి మౌనంగా భరిస్తాయి. తాజాగా వానలతో పంట నాశనం అయి సతమతం అవుతున్న కామారెడ్డి జిల్లా రైతులను ఆదుకోవడానికి ఆపద్భాంధవుల్లా గాడిదలు వచ్చాయి. తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పొలాల్లో చేతికొచ్చిన పంటలు సర్వనాశనం అయ్యాయి. ఈ క్రమంలో వచ్చినకాడికి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుందామంటే తెచ్చుకోలేని పరిస్థితి. ఎడ్ల బండి పోయినా, ట్రాక్టర్లు వెళ్లినా పొలాల్లో దిగబడతాయి. దీంతో ఆ రైతులకు గాడిదలు మేమున్నాం అంటూ సహాయం చేస్తున్నాయి. గత ఏడాది వర్షాకాలంలోనూ గాడిదలు వచ్చాయి, ఈసారి కూడా వచ్చి అవి రైతన్నకు అండగా నిలుస్తున్నాయి. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్రలోని నార్సీ , దెగ్లూర్, ముత్కేడ్.. కర్ణాటక ప్రాంతంలోని ఔరద్, బీదర్ తదితర ప్రాంతాల నుంచి గాడిదలను తీసుకుని తెలంగాణకు వలస వస్తున్నారు. జిల్లాలోని నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, లింగంపేట్, నిజాంసాగర్, బాన్సువాడ తదితర ప్రాంతాలకు వీరు వలస వచ్చి నెల రోజుల వరకు ఉంటున్నారు. 

ఈ క్రమంలో వారి గాడిదలు రైతులకు అక్కెరకు వస్తున్నాయి. గాడిదలపై ధాన్యాన్ని రవాణా చేసేందుకు డబ్బులు ఆశించకుండా రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. రైతు ఇంటికి లేదా ధాన్యం కొనుగోలు కేంద్రానికి 20 బస్తాలకు ఒక బస్తా ధాన్యాన్ని రవాణా ఛార్జీల కింద తీసుకుంటున్నారు. ఒక గాడిద డెబ్బై నుంచి ఎనభై కిలోల బరువు గల ధాన్యాన్ని మోసుకు వస్తున్నాయి. ఈ విషయమై రాజన్న అనే రైతు మట్లాడుతూ ‘ఈసారి కురిసిన భారీ వర్షాలకు పంటలు బాగానే పండాయి. పంట పొలాలకు వెళ్లేందుకు ఎలాంటి వాహనాలు రాకపోతుండటంతో ఈ గాడిదలు మాకు అండగా ఉంటున్నాయి’ అని తెలిపారు. ‘మా ప్రాంతంలో పనులు లేక ఖాళీగా ఉండి ఇటు వలస వచ్చాం. ఇక్కడ పని దొరకడంతో ఇక్కడికి వచ్చి జీవనోపాధి పొందుతున్నాం. మాకు గోధుమ, పత్తి, మినుములు, శనగలు, పెసర్లు వంటి పంటలే పండుతాయి కానీ, వరి పండదు. అందువల్ల మాకు ఏడాదికి సరిపడా వరి ధాన్యాన్ని సంపాదించుకుంటాం’ అంటూ వలస వచ్చిన ఓ వ్యక్తి చెప్పాడు.