కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ విషయమై కలెక్టర్ జితేష్ పాటిల్ స్పష్టతనిచ్చారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా దశలో ఉందని ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ‘ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్నందువల్ల భూములు పోతాయని భయపడొద్దు. ఇదంతా తప్పుడు సమాచారమే. రూల్స ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాం. ఇప్పటివరకు 1026 అభ్యర్ధనలు వచ్చాయి. ఇంకా జనవరి 11 వరకు సమయం ఉంది.
భూములు పోతాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పాత మాస్టర్ ప్లాన్ లో ఉన్న భూములు పోయాయా? ఎవరైనా సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటామ’ని వెల్లడించారు. అటు మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు రామేశ్వర్ పల్లి గ్రామ రైతులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమను సంప్రదించకుండా భూములను రిక్రియేషన్ జోన్ గా ప్రకటించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ రెవెన్యూ గ్రామంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని మాస్టర్ ప్లాన్ లో చూపించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముందని రైతుల తరపున న్యాయవాది టి. సృజన్ కుమార్ రెడ్డి తెలిపారు. వెనక్కి తగ్గేదే లేదని అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని రైతులు పట్టుబడుతున్నారు. ఇక కామారెడ్డి పట్టణంలో చేపట్టిన బంద్ తో వాతావరణం వెడెక్కింది. రైతుల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతునివ్వగా, కలెక్టరేట్ ముట్టడికి బండి సంజయ్ పిలుపునిచ్చారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.