Kamareddy Road Accident: Big Twist in 5 thieves among one student died in Stealing Auto case
mictv telugu

కామారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదంలో పెద్ద ట్విస్ట్.. స్టూడెంట్ బలి

July 19, 2022

కామారెడ్డి జిల్లాలో సోమవారం రోజు జరిగిన లారీ-ఆటో ప్రమాదంలో ట్విస్ట్ వెలుగుచూసింది. జిల్లాలోని మద్నూర్‌ మండలం మేనూరులోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్నూర్‌ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూట్‌లో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడి కంటైనర్‌ లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. స్ధానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన ఆటోలోని ఆరుగురిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేకపోవడంతో ఆటో నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆటోలో మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడంతో అసలు నిజం బయటపడింది.

ప్రమాదానికి గురైన ఆటో అంతకుముందే చోరీకి గురైనట్లు రుద్రూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆటో నిజామాబాద్ జిల్లా రుద్రూరుకు చెందిన షేక్ అస్వద్ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ప్రమాదానికి గురైన ఆటో ఆదివారం చోరీకి గురైంది. యాక్సిడెంట్‌లో చనిపోయిన ఆరుగురిలో ఆటోలో ఉన్న ఐదుగురు వ్యక్తులే ఆటోని చోరీ చేసి ఎత్తుకెళ్తినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అంతే కాదు ఆటోని చోరీ చేసిన వెంటనే గ్యాంగ్‌ మహరాష్ట్రలోని టెంగ్లూర్‌ దగ్గర ఓ బైక్‌ని ఢీకొట్టారు. తిరిగి అక్కడి నుంచి కామారెడ్డి జిల్లాకు చేరుకున్నారు. మద్నూర్‌ దగ్గర ఓ ఇంటర్ స్టూడెంట్‌ లిఫ్ట్ అడగడంతో ఎక్కించుకొని రాంగ్‌ రూట్‌లో వెళ్తూ లారీ కింద చిక్కుకున్నారు.

ఈ ప్రమాదంలో అమాయకుడైన ఆ స్టూడెంట్.. అనవసరంగా ప్రాణాలు కోల్పోయినట్లుగా గుర్తించారు. మిగిలిన ఐదుగురు ఆటో చోరీ చేసి ఎత్తుకెళ్తున్న వారేనని నిర్ధారించారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం.. ఆటోను రాంగ్‌ రూట్‌లో నపడటం కాగా.. పోలీసులకు చిక్కకుండా పారిపోదామనే కంగారులో ప్రమాదానికి గురైనట్లుగా కామారెడ్డి పోలీసులు తెలిపారు.