కనకయ్య గుండె రైటు - MicTv.in - Telugu News
mictv telugu

కనకయ్య గుండె రైటు

December 12, 2019

Kanakaya

మన శరీరంలో గుండె ఏ వైపుకు ఉంటుంది అంటే.. ఎవరైనా ఠక్కున ఎడమవైపు ఉంటుందనే చెబుతారు. కానీ, ఓ పెద్దాయనకు ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడి వైపుకు ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇలాంటి ఘటనే ఈ మధ్య మెదక్ జిల్లా తూప్రాన్‌లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ చిన్నారి కుడివైపు గుండెకలిగి జన్మించింది. ఇదిలావుండగా 65 ఏళ్ల ఈ పెద్దమనిషికి కూడా గుండె కుడివైపుకు ఉంది. ఆయన పేరు  కనకయ్య. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి గ్రామానికి చెందిన కనకయ్య ఏనిమిదేళ్ల క్రితం అనుకోని ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాడు. అక్కడి వైద్యులు కనకయ్యకు వైద్య నిమిత్తం కొన్ని టెస్టులు చేశారు. ఆ టెస్టుల రిపోర్టులు పరిశీలించిన అక్కడి డాక్టర్లకు ముందుగా ఏమీ అర్థం కాలేదు. 

దీంతో మరోమారు టెస్టులు చేశారు. అయినా మళ్లీ అవే రిపోర్టులు వచ్చాయి. వాటిని చూసి వారంతా ఆశ్చర్యపోయారు. కనకయ్య గుండె కుడి వైపుకు ఉందని రిపోర్టుల్లో ఉంది. చాలా కొద్దిమందిలో మాత్రమే ఇటువంటి లక్షణాలు ఉంటాయని, అయినప్పటికీ వారు అందరిలాగే దీర్ఘకాలం ఆరోగ్యంగానే జీవిస్తుంటారని వైద్య నిపుణులు తెలిపారు.కనకయ్యకు భార్యా పిల్లలు కూడా ఉన్నారు. తనకు గుండె కుడివైపు ఉందన్న విషయం 2011 జులైలో తెలిసింది. అయినప్పటికీ ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారని, ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేవని చెబుతున్నారు కనకయ్య కుటుంబీకులు. 

తానూ అందరిలానే వ్యవసాయం చేసుకుంటానని.. గొర్రెలను కూడా కాస్తానని కనకయ్య తెలిపాడు. ‘వాళ్లూ వీళ్లు నా పరిస్థితిని గుర్తు చేసినప్పుడు మాత్రం కాస్త అయోమయం అనిపిస్తుంది. అంతేగానీ, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు’ అని కనకయ్య వివరించాడు.