నాపై కేసులు అక్రమం.. కొట్టేయండి - MicTv.in - Telugu News
mictv telugu

నాపై కేసులు అక్రమం.. కొట్టేయండి

November 2, 2017

తనపై ఆర్యవైశ్యులు అక్రమంగా కేసులు బనాయించారని, వాటిని కొట్టేయాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య హైకోర్టును కోరారు. గురువారం ఈమేరకు కోర్టులో మూడు పిటిషన్లు వేశారు. ఇవి భావప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు.  తాను ఏ కులాన్నీ కించపరచలేదని, వాస్తవాలను మాత్రమే రాశానని తెలిపారు. తన పుస్తకాన్ని నిషేధించాలని దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కూడా కొట్టేసిందని ఆయన గుర్తు చేశారు.ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు ’ పుస్తకం తమ కులంవారి మనోభావాలను గాయపరచేలా ఉందని వైశ్యులు మండిపడ్డం తెలిసిందే. కోరుట్ల,  మల్కాజ్‌గిరి, కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్లలో ఆయనపై కేసులు పెట్టారు. కాగా, ఐలయ్య గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ .. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. షావుకార్ల ఆగడాల వల్లే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.