నా ఆరోగ్యానికి ఢోకా లేదు.. విజయవాడ వెళ్తా.. - MicTv.in - Telugu News
mictv telugu

నా ఆరోగ్యానికి ఢోకా లేదు.. విజయవాడ వెళ్తా..

October 27, 2017

ఆరు నూరైనా తాను విజయవాడ సంఘీభావ సభకు వెళ్లితీరతానని, తననెవరూ అడ్డుకోలేరని ప్రొఫెసర్ కంచ ఐలయ్య స్పష్టం చేశారు. తన ఆరోగ్యం భేషుగ్గా ఉందని, వదంతులను పట్టించుకోవద్దని అభిమానులకు చెప్పారు.

ఆయన శుక్రవారం హైదరాబాద్ లో విలేకర్లతో మాట్లాడారు. ‘విజయవాడలో రేపు నిర్వహించనున్న నా సన్మాన సభపై మా ఇంట్లో చర్చలు జరుగుతున్నాయి. నేను  విజయవాడ వెళ్లకుండా పెద్ద కుట్ర జరుగుతోంది. నేను, నా మిత్రులు, టీమాస్ నాయకులు రేపు విజయవాడలో జరిగే సంఘీభావ సభకు వెళ్తాం. సభకోసం అవసరమైన న్యాయపరమైన అంశాలను సిద్దం చేసుకుంటున్నాం.  మేం మొదట తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించగానే మొట్టమొదట ఉన్న చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్తాం. మేము విజయవాడ సభకు చేరుకునే వరకు భద్రత కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతాం. వారి స్పందనను బట్టి అప్పటికప్పుడు మా తదుపరి కార్యచరణ ప్రకటిస్తాం’ అని ఐలయ్య చెప్పారు. ఆయన రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకంపై వైశ్యుల నిరసన నేపథ్యంలో విజయవాడ పోలీసులు సభకు అనుమతి నిరాకరించడం తెలిసిందే.