సీఎం కొడుకుపై కంగన సంచలన ఆరోపణలు  - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం కొడుకుపై కంగన సంచలన ఆరోపణలు 

July 31, 2020

Kangana Ranaut moks aditya and udhav thakarey calling baby penguin .

బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని నటి కంగనా రనౌత్ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. సుశాంత్ మరణం వెనుక బాలీవుడ్ మాఫియా, నెపోటిజం, కపూర్, ఖాన్ కుటుంబాల బంధుప్రీతి ఉందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్‌కు న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదని చెబుతోంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ లభిస్తోంది. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కుమారుడిని టార్గెట్‌ చేస్తూ ట్వీట్ చేశారు. ‘బేబీ పెంగ్విన్‌’ అని సంబోధిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు రోజు రాత్రి అతని ఇంట్లో పార్టీ జరిగిందని, ఇందులో ఓ ప్రముఖ వ్యక్తి పాల్గొన్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె ట్వీట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ‘ప్రతీ ఒక్కరికి ఈ విషయం తెలుసు. కానీ ఎవరూ తన పేరు చెప్పరు. కరణ్‌ జోహార్‌ ప్రాణ స్నేహితుడు, ప్రపంచంలోనే గొప్ప ముఖ్యమంత్రి యొక్క గొప్ప కుమారుడు. ఆయనను ప్రేమగా బేబీ పెంగ్విన్‌ అని పిలుస్తారు. ఒకవేళ నేను నా ఇంట్లో ఉరి వేసుకుని కనిపిస్తే, దయచేసి నేను ఆత్మహత్య చేసుకున్నానని మాత్రం అనుకోకండి.. అని కంగనా చెబుతోంది’ అంటూ కంగనా రనౌత్‌ ట్వీట్ చేసింది. 

ఆమె ట్వీట్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. ‘మీరు చాలా ధైర్యవంతురాలు మేడం. అందుకే ఆ వ్యక్తి పేరును ప్రస్తావించారు. సుశాంత్‌కు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగవద్దు’ అంటూ సుశాంత్‌ అభిమానులు కంగనాను ప్రశంసిస్తున్నారు. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తుండగా.. సీబీఐకు అప్పగించలేమని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం, మంత్రి ఆదిత్య ఠాక్రేను టార్గెట్‌ చేస్తూ కంగన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆదిత్యను గిట్టని వాళ్లు తండ్రిచాటు బిడ్డ అనే అర్థంలో బేబీ పెంగ్విన్ అని సంబోధిస్తుంటారు. దీనిపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. కాగా, సుశాంత్ కేసును ముంబై పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సుశాంత్ త్రండ్రి కేకే సింగ్ పాట్నా కోర్టులో కేసు వేశారు. గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి, అతని స్నేహితులపై ఆయన అనుమానాలు వ్యక్తంచేశారు.