సంజయ్ రౌత్‌కు కంగనా దసరా గ్రీటింగ్స్.. నా స్ఫూర్తిని కూల్చలేరని..  - MicTv.in - Telugu News
mictv telugu

సంజయ్ రౌత్‌కు కంగనా దసరా గ్రీటింగ్స్.. నా స్ఫూర్తిని కూల్చలేరని.. 

October 25, 2020

Bollywood

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌కు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తనమీద చూపుతున్న వైఖరి పట్ల కంగనా ఏమాత్రం తొణకడంలేదు. తనదైన శైలిలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మహా ప్రభుత్వానికి కౌంటర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శివసేన నేత సంజయ్ రౌత్‌కు కంగనా ట్విటర్‌లో దసరా శుభాకాంక్షలు చెప్పింది. ముంబైలో కూల్చివేసిన తన కార్యాలయం ఫోటోలను తన పోస్టుకు జతచేసింది. తన కార్యాలయం కూల్చేసినా తనలోని స్ఫూర్తి మాత్రం సజీవంగానే ఉందని తెలిపింది. ‘నా చెదిరిన కల మీ ముఖంలో కనిపిస్తోంది. పప్పు సేన నా ఇంటిని కూల్చి ఉండొచ్చు కానీ, నా స్ఫూర్తిని కాదు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని బంగ్లా నంబర్ 5 ఇవాళ  సెలబ్రేట్ చేసుకుంటోంది. దసరా శుభాకాంక్షలు’ అంటూ కంగనా తనదైన శైలిలో ట్వీట్ చేసింది. 

కాగా, బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్యహత్య తర్వాత కంగనా బాలీవుడ్ మాఫియా అని, డ్రగ్స్, నెపోటిజం వంటి అనేక అంశాలను లేవనెత్తింది. దీంతో బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేగింది. ఈ క్రమంలో సుశాంత్ కేసు విషయంలో మహా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కంగనా ఆరోపించింది. దీంతో శివసేన ప్రభుత్వం కంగనా మీద కక్ష్యగట్టింది. ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో కంగనా ఇటీవల పోల్చడంతో ముంబైలో కాలు పెట్టొద్దని సంజయ్ రౌత్ కౌంటర్ ఇవ్వడం వంటి వరుస పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే బాంద్రాలోని కంగనా కార్యాలయాన్ని గత సెప్టెంబర్‌లో బీఎంసీ అధికారులు కూల్చేయడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.  మరోపక్క గవర్నర్‌ను కలిసిన కంగనా ప్రభుత్వ తీరును ఎండగట్టింది.