బాలీవుడ్ అందాల తార, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇటీవలే కంగనా రనౌత్‌పై ముంబై కోర్ట్ ‘ఆమె ఒక సెలబ్రిటీనే అయినా ఆమె ఒక నిందితురాలన్న విషయాన్ని మరచిపోవద్దంటూ’ గుర్తు చేసిన సంఘటన తెలిసిందే. అయితే, ప్రస్తుతం కంగనా రనౌత్ ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. ఆ రియాలిటీ షో పేరు ‘లాకప్’. ఈ నేపథ్యంలో షోకు కంటెస్టెంట్లు వస్తున్నవారు సంచలనాత్మక సీక్రెట్లను బయటపెడుతున్నారు.
తాజాగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు హీరోయిన్ పాయల్ రోహత్గి ఓ భయంకరమైన సీక్రెట్ బయటిపెట్టింది.”15 ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఒకానొక సమయంలో నా కెరీర్ డల్ అయిపోయింది. మీరు నమ్ముతారో లేదో కానీ, నా కెరీర్‌ను పుంజుకునేలా చేయడానికి నేను చేతబడి చేశాను. ఢిల్లీలోని ఓ పూజారి సాయంతో, చేతబడిలోని వశీకరణం అనే తాంత్రిక విద్యను చేశాను. కానీ దానివల్ల నాకు ఏమీ ఒరగలేదు.
నా కెరీర్‌ను కాపాడుకునేందుకు వశీకరణం చేశానని ఎవరికైనా చెప్తే నన్ను చులకన చేసి మాట్లాడతారేమోనని భయపడ్డాను. బహుశా చదువుకున్న అమ్మాయిలు, ఉద్యోగం చేసే మహిళలు ఇలాంటివి నమ్మరేమో! ఒకవేళ నమ్మి చేతబడి చేయించినా ఆ విషయాన్ని గుట్టుగా దాచిపెడతారు” అని చెప్పుకొచ్చింది.
దీంతో ఆమె రహస్యాన్ని విని బిగ్గరగా నవ్వేసిన కంగనా.. ‘నీకు అందంతో పాటు టాలెంట్ కూడా ఉంది. నీకిలాంటి మంత్రతంత్రాలు అవసరం లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా ఏదో చేతబడి చేశానని ఆరోపించారు. ఒక అమ్మాయి సక్సెస్ అందుకుందంటే జనాలు ఆ విజయాన్ని కూడా శంకిస్తారు. నువ్వీ సీక్రెట్ చెప్పి నీ ధైర్యాన్ని చాటుకున్నావు. కాకపోతే నువ్వు సంగ్రమ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు. మరి ఇప్పుడిది విన్నాక నేనో మాంత్రికురాలిని ప్రేమించానని అతడు అనుకోడా?’ అని ప్రశ్నించింది. దీనికి పాయల్ స్పందిస్తూ.. ‘అతడు ఏది నమ్మాలనుకుంటున్నాడో అతడికే వదిలేస్తున్నాను. కానీ, ఆ చేతబడి అతడిపై మాత్రం చేయలేదు’ అని చెప్పుకొచ్చింది. దీంతో సినీ ప్రియులు బాలీవుడ్లో హీరోయిన్స్ తమ కేరీర్ సక్సెస్ అవ్వడానికి చేతబడులు కూడా చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.