సోమువీర్రాజు కారణంగానే బీజేపీని వీడుతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడు అయ్యాక పరిస్థితులు మారిపోయాయని విమర్శించారు. అనుచరుల సమావేశంలో రాజీనామా ప్రకటన అనంతరం ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. బీజేపీపై పెద్దగా విమర్శలు చేయని కన్నా..కేవలం పార్టీలోని వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేశారు. ముఖ్యంగా సోము వీర్రాజు, జీవీఎల్ తీరును విమర్శించారు.
పార్టీలో ఇమడలేకపోతున్నందుకే రాజీనామా చేశానని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. దీనికి కారణం సోము వీర్రాజు అని వెల్లడించారు. అదే విధంగా కొందరు నేతలు రాత్రికి రాత్రే ఓవర్ నైట్ నేత కావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేసిన ఉద్యమంలో జీవీఎల్ పాల్గొని ఉంటే బాగుండేదిని పేర్కొన్నారు. పార్టీతో చర్చించకుండా జీవీఎల్ వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తన భవిష్యత్తుపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు.