బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీలోకి చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈనెల 23న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీకి ఈనెల 16 వ తేదీని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారశైలి నచ్చకనే తాను బీజేపీని వీడుతున్నట్లు కన్నా ప్రకటించారు. బీజేపీకి రాజీనామా చేయడానికి ముందే టీడీపీలోని అగ్రనేతలతో కన్నా చర్చలు జరిపినట్లుగా ప్రచారం జోరుగా సాగింది.
ఈ నేపథ్యంలోనే ఈనెల 16వ తేదీన తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు కన్నా లక్ష్మీనారాయణ. ఈ సమావేశంలోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనుచరులతో సమావేశం అనంతరం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే కన్నా టీడీపీలో చేరే ముందు క్షమాపణలు చేప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. గతంలో చంద్రబాబుతోపాటు తనపై చేసిన విమర్శలకు క్షమాపణలు చెప్పాలన్నారు. గతంలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ వీరిద్దరి మధ్య సఖ్యత లేదు. రాయపాటి వ్యాఖ్యలపై గతంలో కన్నా లక్ష్మీనారాయణ పరువు దావా చేసిన విషయం తెలిసిందే. ఈ మధ్యే ఈ కేసు సంబంధించి రాజీ పడ్డారు.