kannada actor chetan ahimsa controversial comments on kantara movie story
mictv telugu

కాంతార కాంట్రవర్సీ.. ఆదివాసీల ఆచారాలు హిందూ సంస్కృతి కాదా.. తీవ్ర వివాదాస్పద చర్చ

October 24, 2022

కాంతార బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో పాటు కాంట్రవర్సీలకు తెరలేపుతుంది. ఒక వైపేమో హిందూధర్మాన్ని గొప్పగా చూపెట్టారని దేశవాసులు కాంతారకి పట్టం కడుతుంటే.. మరోవైపు అసలు కాంతారలో ఉన్నది భూత కోలా అని దానికి హిందూ మతానికి సంబంధం లేదని కొత్త చర్చ మొదలైంది. ఈ సినిమా దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భూత కోలా’’ హిందూ సంస్కృతిలో భాగమని అన్నారు. దీనికి కౌంటర్ గా మరో కన్నడ నటుడు చేతన్ అహింస చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక పోలీసులు నటుడు చేతన్ కేసు నమోదు చేశారు. తన వ్యాఖ్యల ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదు మేరకు శేషాద్రిపురం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

ఒక ఇంటర్వ్యూలో కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ‘నేను ఒక హిందువుని. అలాగే ఆదివాసుల దేవుళ్ళు కూడా మన హిందూమతంలో భాగమే. వారి ఆచారాలు కూడా హిందూ సంస్కృతి ప్రకారమే ఉంటాయి అని విశ్వసిస్తా. అందరు విశ్వసించాలి. ఒక హిందువుగా ఇది నా నమ్మకం’ అంటూ చెప్పారు. అయితే రిషబ్ శెట్టికి హీరో చేతన్ అహింస కౌంటర్ ఇస్తూ.. హిందూ సంస్కృతికి ఆదివాసీ సంస్కృతికి సంబంధం పెట్టకూడదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హీరో చేతన్ మాట్లాడుతూ.. ‘మా కన్నడ చిత్రం ‘కాంతారా’ జాతీయ స్థాయిలో అలరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కానీ దర్శకుడు రిషబ్ శెట్టి ‘భూత కోలా ‘ హిందూ సంస్కృతి’ అని పేర్కొనటం తప్పు. పంబాడ/నాలికే/పరవ బహుజన సంప్రదాయాలు వైదిక-బ్రాహ్మణ హిందూ మతానికి పూర్వం ఉన్నాయి. భూత కోలా హిందూ మతంలో భాగమని చెప్పడం తప్పు. ఆదివాసీలు ఆచారాన్ని పాటిస్తారు. భూత కోలాలో ‘బ్రాహ్మణత్వం’ లేదు. సినిమాలో హిందూ అని చెప్పకండి. ఇది ఆదివాసీల సంస్కృతి. హిందూ మతం కాలమ్‌లో ఆదివాసీ సంస్కృతిని ఉంచవద్దు’’ అని చేతన్ అన్నారు.