చిన్న బడ్జెట్‌తో తయారై బాక్సాఫీసులను షేక్ చేసిన ‘కాంతార’ మూవీ కలెక్షన్లతోపాటు అరుదైన అవార్డులను, గుర్తింపులను కూడా సంపాదించుకుంటోంది. ఈ మూవీని శుక్రవారం జెనీవా నగరంలోని ఐక్యరాజసమితిలో ప్రదర్శించనున్నారు. ఓ భారతీయ సినిమాను ఐరాసలో ప్రదర్శించనుండడం ఇదే తొలిసారి. దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ జయంతి రోజునే ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటు కావడం విశేషం. ఈ షో కోసం దర్శక కథానాయకుడు రిషభ్ శెట్టి స్విట్జర్లాండ్‌కు చేరుకుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
సినిమా ప్రదర్శన తర్వాత ఆయన పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమాల పాత్ర అనే అంశంపై ప్రసంగిస్తారు. కన్నడ భాషలో రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరెక్కిన కాంతార పలు భారతీయ భాషల్లో విడుదలై 500 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రకృతితో అనుబంధాన్ని, ప్రకృతి విధ్వంసంతో తలెత్తే సమస్యలను ఈ మూవీలో భావోద్వేగంతో కళ్లకు కట్టారు.