కన్నడ ‘కురుక్షేత్ర’.. మరో ‘బాహుబలి’ అవుతుందా! - MicTv.in - Telugu News
mictv telugu

కన్నడ ‘కురుక్షేత్ర’.. మరో ‘బాహుబలి’ అవుతుందా!

July 9, 2019

దక్షిణాది సినీపరిశ్రమలో ఇలాంటి చర్చ జరుగుతోంది. ఆగస్టు 9న విడుదల కానున్న కన్నడ చిత్రం ‘కురుక్షేత్ర’ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాహుబలి తరహాలో అట్టహాసంగా ఉన్న సీన్లు అంచనాలు పెంచుతున్నాయి. రామాయణం, మహాభారాతను వెయ్యికోట్లు, రెండువేల కోట్లతో తీస్తామని కొందరు సినీ దిగ్గజాలు చేస్తున్న ప్రకటనలు సాకారం కాని నేపథ్యంలో ఈ చిత్రం వచ్చేస్తోంది. దీనికి 100 కోట్లకుపైగా ఖర్చు పెట్టారు. 

మహాభారతంలో కీలకమైన కురుక్షేత్ర యుద్ధం కథాంశంగా రూపొందిన ఈ చిత్రానికి నాగ‌న్న దర్శకత్వం వహించాడు. దివంగ‌త నటుడు అంబ‌రీష్ భీష్ముడిగా కనిపించడం ఇందులో విశేషం. కృష్ణుడిగా రవించంద్రన్, ధుర్యోధ‌నుడిగా దర్శన్, అర్జునుడిగా సోనూ సూద్, ద్రౌప‌దిగా స్నేహ‌ నటించడంతో శాండల్‌వుడ్‌తో ఇతర భాషల పరిశ్రమల్లో సైతం ఆసక్తి కలుగుతోంది. నటుల సీరియస్ స్టిల్స్, కళ్లుచెదరే కాస్ట్యూమ్స్, యుద్ధసన్నివేశాలు, గ్రాఫిక్స్ బాహుబలి ప్రభాస్, రానాలను గుర్తుకు తెస్తున్నాయి. అభిమన్యుడు రథచక్రాన్ని ఎత్తే సీన్ బాహుబలి శివలింగం సీన్ లా ఉందని అంటున్నారు. 

 బాహుబలి దర్శకుడు రాజమౌళి మహాభారతం సినిమాగా తీస్తారని, అందులోని కురక్షేత్ర యుద్ధం బాహుబలి పోరాటలను మించి ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే మలయాళంలో మోహన్ లాల్ 100 కోట్లతో మహాభారతం తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాటన్నిటిని పక్కకు తోస్తూ నాగన్న ముందుకు తెచ్చిన కురుక్షేత్ర హిట్ అయితే భారత ఇతిహాసాలు వెండితెరపై మరిన్ని క్యూ కట్టడం ఖాయం.