ఆరో అడుగుతోనే ఆపేసింది...నల్లగా ఉన్నాడని - MicTv.in - Telugu News
mictv telugu

ఆరో అడుగుతోనే ఆపేసింది…నల్లగా ఉన్నాడని

November 25, 2019

Kanpur bride stopped wedding in sat phere stage

ఇంకో అడుగు వేస్తే పెళ్లి తంతు ముగుస్తుంది. నవవధూవరులు కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. ఇంతలో ఏమైందో ఏమో వరుడు నల్లగా ఉన్నాడని.. వయసులో తన కంటే పెద్దగా కనిపిస్తున్నాడని వధువు పెళ్లి ఆపేసి మండపం నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కాన్పూర్‌లో సమీపంలోని సచెండీ గ్రామంలో ఓ రైతు ఇంట్లో అతడి కుమార్తె పెళ్లి వేడుక జరుగుతోంది. సాయంత్రం విందు కార్యక్రమం పూర్తయ్యాక వరమాల కార్యక్రమం జరిగింది. తరువాత వేదమంత్రాల నడుమ పెళ్లి కార్యక్రమం ప్రారంభమయ్యింది. 

వధూవరులు ఏడు అడుగులు వేసే కార్యక్రమంలో ఆరడులు పూర్తయ్యాయి. ఇంతలో వధువు స్నేహితురాలు ఆమె చెవిలో ఏదో చెప్పింది. అంతే.. వధువు ఏడవ అడుగు వేయకుండా అక్కడే ఆగిపోయింది. ముఖంపైనున్న మేలి ముసుగును తొలగించి, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. ఎందుకని ఆమె తల్లిదండ్రులు ప్రశ్నించగా… వరుడు నల్లగా ఉన్నాడని, పైగా ఎక్కువ వయసు వ్యక్తిగా కనిపిస్తున్నాడని ఆరోపించింది. ఆమెకు ఇరు కుటుంబాల వారు ఎంత నచ్చజెప్పినా వినలేదు. పోలీసులు కూడా రంగంలోకి దిగి కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ వారి మాట కూడా వినలేదు. దీంతో చేసేందేం లేక వరుడు అతని బంధువులతో కలిసి ఇంటికి వెళ్లిపోయడు.  ఇంతకి వధువు స్నేహితురాలు ఆమె చెవిలో ఏం చెప్పిందో తెలియాల్సిఉంది.