ఫెయిలయిన సబ్జెక్టులో పాస్ కావాలంటే తనను ప్రేమించాలని, గర్ల్ ఫ్రెండుగా మారి డబ్బులిస్తేనే పాస్ చేస్తానని ఓ యువతికి విచిత్ర ప్రపోజల్ వచ్చింది. దానికి యువతి తిరస్కరించగా, అదే సబ్జెక్టులో సదరు యువతి మళ్లీ ఫెయిలయిన ఘటన యూపీలోని కాన్పూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాజ్ పూర్ స్టేషన్ పరిధిలో బాధిత యువతి నివసిస్తోంది. కాన్పూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకుంటోంది. అయితే ఇటీవల వచ్చిన పరీక్షా ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో పాసైన యువతి కేవలం మ్యాథ్స్ సబ్జెక్టులో మాత్రమే ఫెయిలైంది. అందులో కేవలం 11 మార్కులే రావడంతో రీకౌంటింగ్ కి దరఖాస్తు చేసుకుంది.
ఇంతలో యువతికి గుర్తు తెలియని నెంబర్ నంచి కాల్ వచ్చింది. అందులో ఓ వ్యక్తి తనకు గర్ల్ ఫ్రెండుగా మారాలని, దాంతో పాటు రూ. 5 వేలు ఇస్తేనే పాస్ చేస్తానని ప్రపోజ్ చేశాడు. కానీ యువతి నిరాకరించగా, రీకౌంటింగులో ఈ సారి 0 మార్కులే వచ్చాయి. దీంతో తనకు ఫోన్ చేసిన వ్యక్తి చేసిన పనే ఇదని అనుమానించిన యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.