Kantara broke the record of KGF movie in karnataka
mictv telugu

రిషభ్ శెట్టి ప్రభంజనం.. కేజీఎఫ్ సిరీస్‌ను దాటేసిన ‘కాంతార’

October 24, 2022

చిన్న సినిమాగా విడుదలై అద్భుత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కన్నడ కాంతార సినిమా ఇప్పుడు మరో రికార్డును తిరగరాసింది. కన్నడలో భారీ హిట్ సినిమాగా పేరుగాంచిన కేజీఎఫ్ సిరీస్ సినిమాలను కాంతారా దాటేసింది. ఈ విషయాన్ని కాంతార దర్శక హీరో రిషభ్ శెట్టి వెల్లడించారు. అన్నిభాషల్లో కలుపుకొని ఇప్పటివరకు 167 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం కన్నడలో మరో రికార్డును తనపేర రాసుకుంది. కర్ణాటకలో థియేటర్లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా రికార్డును తిరగరాసింది. ఇంతకుముందు ఈ రికార్డు కేజీఎఫ్ సిరీస్ పేరు మీదు ఉండేది. కేజీఎఫ్ సినిమాను 75 లక్షల మంది, కేజీఎఫ్ 2 సినిమాను కన్నడలో 72 లక్షల మంది చూశారు. కాంతారాను మాత్రం కేవలం 25 రోజుల్లోనే 77 లక్షల మంది చూశారు.

 

 

ఇది రానున్న రోజుల్లో కోటి దాటుతుందని అంచనా. వీటన్నింటికి ముందు దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన రాజకుమార చిత్రం ఉంది. 2017లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లోనే 65 లక్షల మంది చూశారు. ఇప్పుడు ఈ చిత్రం నాలుగో స్థానంలో నిలిచింది. అయితే కలెక్షన్లలో మాత్రం కేజీఎఫ్ సిరీస్ ముందుంది. ఎందుకంటే కేజీఎఫ్ సిరీస్ సినిమాలకు టిక్కెట్ రేట్లు ఎక్కువ పెట్టారు. కాంతారాకు మామూలు రేట్లే ఉండడంతో కలెక్షన్లలో కేజీఎఫ్‌ కంటే వెనుకబడిపోయింది. ఇక్కడ మరో విశేషమేంటంటే.. ఈ నాలుగు చిత్రాలను హొంబలే ఫిలింస్ సంస్థ నిర్మించింది. కాంతార, కేజీఎఫ్ రెండు సినిమాలు, రాజకుమార చిత్రాలను ఒకే సంస్థ నిర్మించడం, ఈ నాలుగు చిత్రాలు అత్యధిక వీక్షణలున్న కన్నడ చిత్రాలుగా రికార్డు సాధించడంతో ఆ సంస్థ పేరు మారుమ్రోగిపోతోంది. ఏది ఏమైనా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కాంతారా అటు రిషభ్ షెట్టికి, ఇటు నిర్మాణ సంస్థకు మర్చిపోలేనంత పేరు తెచ్చిపెట్టింది.