కాంతార క్లైమాక్స్‌‌పై వివాదం.. మూవీ టీమ్‌కి నోటీసులు.. - MicTv.in - Telugu News
mictv telugu

కాంతార క్లైమాక్స్‌‌పై వివాదం.. మూవీ టీమ్‌కి నోటీసులు..

October 26, 2022

పబ్లిసిటీ కోసమో లేక సహజమో కానీ ‘కాంతార’ మూవీని రోజుకొక కాంట్రవర్సీ చుట్టుకుంటుంది. ఆదివాసుల సంస్కృతి, సాంప్రదాయాలపై తెరకెక్కిన కాంతార సౌత్ టు నార్త్ కనక వర్షం కురిపిస్తుంది. ఈనెల 15వ తేదీన విడుదలైన ‘కాంతార’ తెలుగు వెర్షన్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 రోజుల్లో సుమారు రూ.27.6 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే కలెక్షన్స్‌తో పాటు కాంతారకి వరుస కాంట్రవర్సీలు వస్తున్నాయి. ఈ కథలో చూపెట్టిన ఆదివాసుల సాంప్రదాయాలు మన హిందూధర్మంలో భాగం కాదని.. ఇందులో చూపెట్టిన ‘భూతకోల’ సాంప్రదాయంలో బ్రాహ్మణత్వం లేదని విమర్శలు తారస్థాయిలో వచ్చాయి. దాంతో కాంతారని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్న హిందు ధార్మికులంతా ఆ వాదనని తప్పుపట్టారు.

ఈ వివాదం నడుస్తుండగానే తాజాగా కాంతార క్లైమాక్స్ చుట్టూ మరో కాంట్రవర్సీ వెలుగులోకి వచ్చింది. మూవీ క్లైమాక్స్‌లో కోల చెప్పే వ్యక్తిగా రిషబ్ శెట్టి నట విశ్వరూపం చూపెట్టే సన్నివేశంలో వచ్చే ‘వరాహ రూపం’ సాంగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. అయితే ఆ ‘వరాహ రూపం’ సాంగ్‌ని కాపీ కొట్టారంటూ ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే మ్యూజిక్ బ్యాండ్ తాజాగా ఆరోపణలు గుప్పించింది. తైక్కుడం బ్రిడ్జ్‌కి చెందిన సాంగ్ ‘నవరస’‌ని ఆ వరాహ రూపం సాంగ్‌ పోలి ఉందని ఇది కాపీరైట్ చట్టాలను బ్రేక్ చేయడం కిందకే వస్తుందని తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపిస్తోంది. అంతేకాదు ఈ విషయమై కాంతార టీమ్‌కి చట్టపరంగా నోటీసులు కూడా పంపబోతున్నట్లు స్పష్టం చేసింది. అయితే అజనీష్ లోక్ నాథ్ అనే కన్నడ సంగీత దర్శకుడు కాంతారకి మ్యూజిక్ అందించాడు.