16 కోట్లు బడ్జెట్‌తో 400 కోట్లు కొల్లగొట్టిన కన్నడ మూవీ ‘కాంతారా’ను కాపీరైట్ ఉల్లంఘన కేసు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ‘వరాహరూపం’ పాటను కాపీ కొట్టిన కేసులో సినిమా దర్శకుడు, హీరో రిషభ్ శెట్టిని కేరళ పోలీసులు ఆదివారం విచారించారు. హైకోర్టు ఆదేశంతో రిషభ్ కేరళలోని కోజికోడ్‌లో పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. విచారణకు నిర్మాత విజయ్ కిర్గందూర్ కూడా హాజరయ్యాడు. కొన్ని గంటల పాటు విచారించిన పోలీసులు.. అవసరమైతే మరోసారి పిలుస్తామని చెప్పారు.
వరాహరూపం ఒరిజినల్ సాంగ్ తమదని, తమకు చెప్పకుండా సినిమాలో వాడుకున్నారని కోజికోడ్‌కు చెందిన తెయ్యుకుడం బ్రిడ్జ్ అనే సంగీత బృందం కోర్టుకెక్కింది. దీంతో ఆ పాటను సినిమా నుంచి తీసేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటికీ కొన్నిచోట్ల ఆ పాటను ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వివాదం సుప్రీం కోర్టుకు కూడా చేరింది. కేరళ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. వరాహరూపం పాటను సినిమా నుంచి తొలగించాల్సిన అవసరం లేదని, రిషబ్ శెట్టికి, నిర్మాతకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.