భారత్ మాజీ ఆటగాడు కపిల్‌దేవ్ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. అవకాశం దొరికినప్పుడల్లా టీం ఇండియాలో లోపాలను ఎత్తి చూపే కపిల్ దేవ్ ఈ సారి భారత్ కెప్టెన్ రోహిత్ శర్మను టార్గెట్ చేశాడు. రోహిత్ ఫిట్‌నెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ని ఆ పొట్టతో చూడలేకపోతున్నామని చురకలంటించాడు. ఫిట్‌నెస్ విషయంలో రోహిత్ శర్మ.. కోహ్లీని చూసి నేర్చుకోవాలని చెప్పి..అభిమానుల మధ్య కొత్త వివాదానికి తెరలేపాడు.
ఫిట్‌నెస్ విషయంలో రోహిత్ శర్మ మరింత కష్టపడాలని సూచించాడు. టీం ఇండియాకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ లావుగా ఉండడం సిగ్గుచేటన్నారు. కనీసం టీవీల్లో అయినా ఫిట్‌గా కనిపించేందుకు ప్రయత్నించాలన్నాడు కపిల్ దేవ్. “ఆ పొట్టతో టీవీల్లో రోహిత్‌ను చూడలేకపోతున్నాం. రోహిత్ గొప్ప ప్లేయర్, గొప్ప కెప్టెన్.. అయినా కూడా ఫిట్‌నెస్ సాధించి తీరాల్సిందే. విరాట్ కోహ్లీని చూసిన ప్రతీసారీ ఫిట్‌గా హెల్తీగా కనిపిస్తాడు. ఫిటెనెస్ విషయంలో కోహ్లీ యావత్ క్రీడా ప్రపంచానికే ఆదర్శం. క్రికెటర్లు అలా ఉంటేనే వికెట్ల మధ్య చిరుతల్లా పరుగెత్తగలరు…’ అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.
రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఎప్పటినుంచో విమర్శలు వస్తున్నాయి. మైదానంలో పరుగుల వరద పారించినా..తన ఫిట్ నెస్‌ను మాత్రం వేలెత్తిచూపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా రోహిత్ పొట్ట, శరీరాకృతిని విమర్శించారు. వడాపావ్ పేరుతో కూడా రోహిత్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు మరోసారి వ్ రోహిత్‌పై కపిల్ దేవ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.