ఆదివారం జరిగిన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో నందమూరి బాలయ్య చేసిన కామెంట్స్ పలు వర్గాల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇప్పటికే అక్కినేని తొక్కినేనిపై అక్కినేని వారసులు కౌంటర్ ఇవ్వగా, తాజాగా కాపునాడు స్పందిస్తూ బాలయ్యకు అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ లోపు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఆ రంగారావు ఈ రంగారావు వ్యాఖ్యలపై కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయని, క్షమాపణ చెప్పని పక్షంలో రంగా విగ్రహం వద్ద మౌన ప్రదర్శన పాటిస్తామని స్పష్టం చేసింది. గతంలోలాగా సంతకం లేని క్షమాపణ లేఖను ఒప్పుకునేది లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ కాపులకు సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. ఒకవేళ ఇలా జరగకుంటే టీడీపీ నుంచి బాలయ్యను పదేళ్ల పాటు బహిష్కరించాలని, ఇది కూడా జరగకుంటే లోకేష్ పాదయాత్రను అడ్డకుంటామని హెచ్చరించింది. కాగా, గతంలోనూ బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. చిరంజీవి రాజకీయాల్లో విఫలమయ్యారనే ఉద్దేశంతో ‘మా బ్లడ్డు వేరు.. మా బ్రీడు వేరు’ అని, పవన్ కల్యాన్ జనసేన పార్టీలో ఉన్నవారందరూ ‘అలగా జనం, సంకర జాతి జనం’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.