సరిహద్దు దేశం పాకిస్తాన్‌లో పోలీసులు మరోసారి రెచ్చిపోయారు. కరాచీలోని షరియా ఫైసల్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మొత్తం పది మంది ఉగ్రవాదులు దాడిన పాల్పడిన ఈ ఘటనలో కరాచీ పోలీస్ బాస్ సహా మొత్తం 12 మంది పోలీసులు చనిపోయారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హెడ్‌క్వార్టర్స్‌ని చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య ప్రస్తుతం ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అటు ఈ ఘటనతో పాకిస్తాన్ మరోసారి ఉలిక్కిపడింది. కాగా, ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో అప్పుకోసం అర్రులు చాస్తున్న పాకిస్తాన్.. విధిలేని పరిస్థితుల్లో ఐఎంఎఫ్ షరతులకు ఒప్పుకుంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్, కిరోసిన్ల ధరలను విపరీతంగా పెంచింది. దీనివల్ల కరెన్సీ విలువ పడిపోవడంతో పాటు ద్రవ్యోల్బణం దారుణంగా పెరిగిపోయింది. ప్రజలు తిండి దొరక్క దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కూడా దేశంలో ఉగ్రదాడులు జరగడం పట్ల సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.