కారంచేడు మచ్చకు 34 ఏళ్లు.. న్యాయమా, నువ్వెక్కడ?  - MicTv.in - Telugu News
mictv telugu

కారంచేడు మచ్చకు 34 ఏళ్లు.. న్యాయమా, నువ్వెక్కడ? 

July 17, 2019

Karamchedu dalits incident completes 34 years ...

‘సర్వేజనా: సుఖినోభవంతు’ అని ఘోషించే భారతదేశం నుదుటిపై కులపు మచ్చలెన్నో. వాటిలో కారంచేడు దళితుల రక్తం ఇంకా పచ్చిగానే ఉంది. ఈ దురాగతానికి నేటితో 34 ఏళ్లు. ఇన్నేళ్లయినా బాధితు కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదు. హంతకులు అందలాలెక్కారు. విదేశాలలకు చెక్కేశారు. నామమాత్రపు శిక్షలతో తప్పించుకున్నారు.  అట్టడుగు కులాలకు న్యాయం విషయంలో మన న్యాయదేవత వేగం ఎంతో కళ్లకు కట్టే ఈ దురాగతాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటే.. 

తాగునీటి చెరువులో.. 

అది 1985, జూలై 16వ తేది. ప్రకాశం జిల్లా చీరాల మండలం కారంచేడు గ్రామం. రాయినీడి శ్రీనివాసరావు అనే కమ్మకులస్తుడు దళితుల తాగునీటి చెరువులోకి పశువులను కడుగుతున్నాడు.దీన్ని చూసిన దళితులు కత్తి చంద్రయ్య, సువార్తమ్మలు అతణ్ని వారించారు. శ్రీనివాసరావు పట్టించుకోలేదు. అతనికి వత్తాసుగా మరికొందరు అగ్రకులస్తులు వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరుసటి రోజు.. 17 దళితవాడలో నెత్తురు చిందింది. అగ్రకులస్తులు దాడిచేసి ఆరుగురు దళితులను చంపేశారు. తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యెహోషువా, దుడ్డు వందనం,దుడ్డు రమే్‌ష, దుడ్డు అబ్రహాం కులం కత్తికి బలయ్యారు. కొంతమంది మహిళలపై అఘాయిత్యాలు సాగాయి. దళితులు భయంతో ఇళ్లు వదలి చీరాలకు పారిపోయారు. 

విచారణ లోపాల గుట్ట.. 

కేసుపై సుదీర్ఘ విచారణ జరిగింది. సాక్ష్యాలు తారుమారయ్యాయి. బాధితులు పట్టువదలకుండా పోరాడారు. విచారణ సమయంలో సాక్షి అలీసమ్మ హత్యకు గురైంది. నిందితుల్లో పలువురు చక్కగా కాలం చేసి వెళ్లిపోయారు. మొత్తానికి 24 ఏళ్ల తర్వాత కొంతమంది దోషులకు నామమాత్రం శిక్షలు పడ్డాయి. ఒకరికి జీవిత ఖైదు, 29 మందికి మూడేళ్ల జైలు శిక్షలు పడ్డాయి. సత్ప్రవర్తన పేరుతో జీవిత ఖైదీ, శిక్ష ముగించుకుని దోషులూ అందరూ బయటికి వచ్చేశారు. ఘాతుకానికి సూత్రధారి అయిన ఎన్టీఆర్ వియ్యంకుడు దగ్గుబాటి చెంచురామయ్యను నాటి పీపుల్స్‌వార్ నక్సలైట్లు కాల్చిచంపేశారు.  

న్యాయం జరగలేదు.. 

పునరావాసం, చిన్నపాటి ఆర్థిక సాయంతో సరిపెట్టారని, దోషులను శిక్షించలేకపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూమి అందరికీ అందలేదని, ఇప్పటికైనా తమకు సాగుభూమి ఇవ్వాలని మున్నంగి సువార్తమ్మ, – దుడ్డు భాస్కరరావు తదితరులు కోరుతున్నారు.