ఏదో సామెత చెప్పినట్లు వేరెవరో తప్పు సరిచేయబోయి తాను చిక్కుల్లో ఇరుక్కుంది సినీ నటి కరాటే కళ్యాణి. ప్రాంక్ పేరుతో ఆసభ్యకర వీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై ఎస్ఆర్నగర్ పీఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు తనపై దాడి చేసిందంటూ కళ్యాణిపై కూడా కేసు పెట్టాడు శ్రీకాంత్ రెడ్డి. ఈ కేసు దర్యాప్తు చేపట్టగా కల్యాణి ఓ చిన్నారి దత్తత వ్యవహారం చర్చనీయాంశమైంది. శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసే సమయంలో ఆమె ఎత్తుకున్న చంటిబిడ్డ విషయంలో కళ్యాణికి గతంలోనే అధికారులు నోటిసులు ఇచ్చారట. ఆమె ఆ నోటీసులకు స్పందించకపోగా.. దాని గురించి ఎలాంటి సమాధానం , సంజాయిషీ ఇవ్వలేదట. ఈ నేపథ్యంలో ఈరోజు(సోమవారం) కూడా ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. రేపటి వరకు ఆమె ఈ నోటీసులపై స్పందించకపోతే కరాటే కళ్యాణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని రూల్స్ పాటించాలని, అలా కాకుండా చట్టానికి విరుద్ధంగా వెళితే మాత్రం మూడేళ్లు జైలు శిక్ష పడుతుందని చెబుతున్నారు అధికారులు. కరాటే కల్యాణి అక్రమంగా పాపను దత్తత తీసుకుందని పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ చిన్నారి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది వంటి తదితర వివరాలపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆకస్మాత్తుగా కరాటే కల్యాణి కనిపించకుండా పోవడం కొసమెరుపు. ఆమె ఆజ్ఞాతంలోకి వెళ్లిందా?.. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అనేది తెలియల్సి ఉంది.