ఎనిమిదేళ్ల బాలిక ధైర్యంతో తన రెండేళ్ల తమ్ముడి ప్రాణాలను కాపాడింది. ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఓ పొగరుబోతు ఆవు ఆకస్మాత్తుగా వారి ఇంటి ఆవరణలోకి వచ్చింది. ఆడుకుంటున్న పిల్లవాడిని కొమ్ములతో కుమ్మేయబోయింది. అయితే అతనితోపాటు ఆడుకుంటున్న అక్క ఎంతో చాకచక్యంతో ఆవును ఎదుర్కొంటూ, బుజ్జగాడిని కాపాడింది. ఈ ఘటన కర్ణాటకలోని హోన్నవార్ తాలూకా నవిలాగోన్ గ్రామంలో మంగళవారం జరిగింది.
ఎల్ఐసీ అడ్వైజర్‌గా పనిచేస్తున్న కిరణ్ శెట్టికి ముగ్గురు సంతానం. శివరాత్రి రోజు స్కూలుకు సెలవు కావడంతో కిరణ్ పిల్లలు ఆరతి, కార్తీక్ ఇంటి బయట ఆడుకుంటున్నారు. తమ్ముడు కార్తీక్‌ను ట్రై సైకిల్ మీద కూర్చోబెట్టి ఆరతి ఆడిస్తుండగా.. అకస్మాత్తుగా ఒక ఆవు వారిపైకి దూసుకొచ్చింది. కొమ్ములతో కుళ్లబొడుస్తున్నా కూడా ఆరతి తన తమ్ముడిని వదల్లేదు. అతన్ని రెండు చేతులతో పెకెత్తి వెనక్కి వెళ్లింది. ఆవు ఆరతి వీపును అనేకసార్లు పొడిచింది. అయినా ఆ పిల్ల బెదరకుండా తమ్ముడిని ఎత్తుకునే ఉంది.ఇంతలో వాళ్ల అరుపులు విని కుటుంబ సభ్యులు బయటకు రావడంతో ఆరతి.. తమ్ముడిని ఎత్తుకుని ఇంట్లోకి పరుగెత్తింది. ఆ ఆవును అక్కడి నుంచి కుటుంబ సభ్యులు తరిమేశారు. అందుకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.