మన దేశంలో ఎన్నో రంగాల్లో రాకెట్ వేగంతో ముందుకు దూసుకెళ్తోంది. అయితే దళితుల విషయంలో మాత్రం యుగాల వెనక్కి పోతోంది. వారిపై రోజూ ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. వారిని అగ్రకులాలు అవమానిస్తూనే ఉన్నాయి. గుర్రం ఎక్కడనో, కోర మీసం పెట్టుకున్నాడనో.. ఏదో ఒక సాకుతో దాడి చేస్తున్నారు. దళితులకు హెయిర్ కట్ చేశాడంటూ ఓ బార్బర్ కుటుంబాన్ని సమాజం నుంచి బహిష్కరించారు.
కర్ణాటకలో ఈ అమానుషం జరిగింది. అసలే కరోనా కష్టకాలం కావడంతో చిక్కుల్లో ఉన్న ఆ బార్బర్పై సాగుతున్న వేధింపులు మన సమాజంలో కులవివక్ష వికృత రూపాన్ని కళ్లకు కడుతున్నాయి.
మైసూరు జిల్లాలోని నంజనాగుడు తాలూకా హల్లారే గ్రామానికి చెందిన మాల్లికార్జున శెట్టికి సెలూన్ ఉంది. పొట్టకూటి కోసం అతడు దళితులకు హెయిర్ కట్ చేశాడు. అయితే గ్రామంలో కొందరికి ఇది జీర్ణం కాలేదు. దళితులకు క్షవరం చేసిన చేతులతోనే తమకూ క్షవరం చేస్తావా? అంటూ అతనిపై దూషణకు దిగారు. మల్లికార్జున కుటుంబాన్ని బహిష్కరించారు. అంతేకాకుండా కట్టబాటు ఉల్లంఘించినందుకు 50 వేల రూపాయల జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించారు. దీనిపై అతడు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాడు. ఇదివరకు కూడా రెండుసార్లు తమను బహిష్కరించారని తెలిపాడు.
‘ఎప్పుడూ ఏదో ఒకసాకుతో వేధిస్తుంటారు. మహదేవ నాయక్ అనే వ్యక్తి నా షాపు వచ్చాడు. దళితులకు కటింగ్, షేవింగ్ చేస్తే 200 రూపాయల నుంచి 300 రూపాయలు వసూలు చేయాలని ఆదేశించాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఇతరుల నుంచి ఎంత తీసుకుంటానో దళితుల నుంచీ అంతే తీసుకుంటాను అని చెప్పాను. దీంతో నాయక్, అతని స్నేహితులు నా కొడకును కొట్టారు. అతని జేబులోంచి 5 వేల రూపాయలను లాక్కుపోయారు. నా కొడుకుకు బలవంతంగా మద్యం తాగించి బట్టలు విప్పించి వీడియో తీశారు. పోలీసులకు చెబితే ఆ వీడియోను బయట పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మాపై ఎందుకింత పగ? అసలు దళితుడికి హెయిర్ కట్ చేయడం నేరం ఎలా అవుతుంది? మాకు ఎవరైనా ఒకటే కదా. మాపై వేధింపులకు ఆపకపోతే అందరం ఆత్మహత్య చేసుకుంటాం.. ’ అని మల్లికార్జున చెప్పాడు. వెలివేతపై అతడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపించి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.