నటి సుమలతకు కరోనా.. గొంతునొప్పితో వెళ్తే - MicTv.in - Telugu News
mictv telugu

నటి సుమలతకు కరోనా.. గొంతునొప్పితో వెళ్తే

July 6, 2020

Sumalatha

కరోనా వైరస్ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో అంతుచిక్కకుండా ఉంది. వైద్యులు, పోలీసులు, పారిశుద్య కార్మికులు, సినీరంగంలోని వారికి కరోనా సోకుతున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా ప్రముఖ సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలతకు కరోనా వైరస్ సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో ఆమెకు పాజిటివ్ వచ్చింది. ఎంపీగా ఉన్న ఆమె తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పి వచ్చాయి. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ప్రస్తుతం సుమలత హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ సలహా మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ప్రజలందరి ఆశీర్వాదంతో త్వరలోనే కరోనా నుంచి కోలుకుంటాను. ఇటీవల నేను కలిసిన వారందరి వివరాలను అధికారులకు వెల్లడంచాను. వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి’ అని సుమలత తెలిపారు. కాగా, సుమలత తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘బతుకు జట్కా బండి’ కార్యక్రమాన్ని కొన్ని రోజులు హోస్ట్‌ చేశారు. మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. జేడీఎస్ అభ్యర్థి, దేవెగౌడ మనవడు నిఖిల్‌పై ఎంపీగా గెలిచారు.