కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార బీజేపీకి అనుకోని షాక్ తగిలింది. భారీగా లంచం తీసుకుంటూ బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు అడ్డగా బుక్ అయ్యాడు. ఈ వ్యవహారం రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది. నోట్ల కట్టలతో సహా దొరికిన ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ మండల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మండల్ తన కార్యాలయంలో రూ.40 లక్షలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖకు చెందిన లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. వాటితోపాటు ఆఫీస్‌లో లభించిన మరో రూ.కోటీ 40 లక్షలు సీజ్‌చేశారు.
విచారణ అనంతరం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. గరువారం, శుక్రవారం వరుసగా ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా రూ. 8 కోట్లు లభించాయి. దీంతో ఆయనను అధికారులు అరెస్టు చేశారు. ఆయన తండ్రి తరఫున లంచం తీసుకుంటున్నట్లు తేలిందని వెల్లడించారు. ఇంత నగదు ఎలా వచ్చిందనే విషయంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ఇదే విషయమై త్వరలోనే ఎమ్మెల్యే విరూపాక్షప్పకు కూడా లోకాయుక్త అధికారులు నోటీలు జారీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ అవినీతి బాగోతం బయటపడడంతో ఎమ్మెల్యే విరూపాక్షప్ప .. ఇందుకు బాధ్యతగా కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
ప్రశాంత్ తండ్రి మాడాళు విరూపాక్షప్ప దావణగెరె జిల్లా చెన్నగిరి ఎమ్మెల్యే. కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి అయిన ప్రశాంత్.. 2008 బ్యాచ్‌కు చెందినవారు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ‘‘అవినీతిని అరికట్టేందుకు లోకాయుక్తను తిరిగి ఏర్పాటు చేశాం.. కాంగ్రెస్ హయాంలో లోకాయుక్త రద్దుతో చాలా కేసులు మూతపడ్డాయి.. మూసివేసిన కేసులను విచారిస్తాం.. లోకాయుక్త ఒక స్వతంత్ర సంస్థ.. మా వైఖరి స్పష్టంగా ఉంది. సంస్థ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుంది.. మేము దానిలో జోక్యం చేసుకోం’అని సీఎం బొమ్మై అన్నారు.