ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడమే కాకుండా, ఇదేంటని ప్రశ్నించినందుకు పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది ఓ ఎమ్మెల్యే కూతురు. అంతటితో ఆగకుండా ఈ తతంగాన్ని మీడియా ద్వారా రికార్డు చేస్తున్న కెమెరామెన్, జర్నలిస్ట్‌లతో అనుచితంగా ప్రవర్తించి జర్నలిస్ట్‌పై చేయిచేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో గురువారం వెలుగుచూసింది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ నింబావలి కూతురు బీఎండబ్ల్యూ కారు నడుపుతూ సిగ్నల్ జంప్ చేసింది. రెడ్ సిగ్నల్ పడినా.. ఆమె కారు ఆపలేదు. అతివేగంగా వాహనం నడపటంతో ట్రాఫిక్ పోలీసులు ఆమెకు జరిమానా విధించారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాళ్లను నోటికొచ్చినట్టు తిట్టడమే కాకుండా.. అక్కడున్న ఓ జర్నలిస్ట్‌పై ఆమె చేయిచేసుకుంది.
అయితే, తన కుమార్తె చర్యలను సదరు ప్రజాప్రతినిధి సమర్ధించడం గమనార్హం. బెంగళూరులో రోజూ ఇలాంటి ఘటనలు వేలాదిగా జరుగుతుంటాయని, తన కుమార్తె చేసిన దాంట్లో తప్పేం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, నా కుమార్తెనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు వస్తున్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడం, వీడియో వైరల్ కావడంతో చివరకు ఆయన తన కుమార్తె చేసిన పనికి క్షమాపణలు చెప్పారు.