కర్ణాటక సీఎంగా ప్రమాణం చేశాడు.. ఇదేంది ‘స్వామీ’!
కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుని ఇప్పుడు కుదుటపడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఓ బీజేపీ మంత్రి చిత్రమైన ప్రమాణస్వీకారం చేసి ఇన్ని రోజులుగా సాగిన కర్ణాటక ఉత్కంఠ రాజకీయాలకు కొసమెరుపుగానవ్వులు పూయించారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే.. ఎంపీగా ప్రమాణం చేయాల్సింది పోయి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసి, నవ్వులు పూయించారు. అక్కడే వున్న ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా నవ్వకుండా వుండలేకపోయారు.
ప్రమాణ స్వీకారంలో తికమకకు గురైన ఆ ఎంపీ ఎవరంటే.. బీజేపీ ఎంపీ మధుస్వామి.. ఆయన కర్ణాటక మంత్రివర్గంలో ఈ రోజు చేరారు. మంత్రికి బదులు ముఖ్యమంత్రి అనడంపై యడ్యూరప్ప నవ్వుకోవడమే కాకుండా భలే ప్రమాణం చేశావన్నట్టు ఆయనకు కౌగిలి కూడా ఇచ్చారు. కాగా, జూలై 26న కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన మంత్రివర్గం ఎప్పుడు ఏర్పాటు అవుతుందని అందరూ ఎదురుచూశారు. దాదాపు మూడు వారాల తర్వాత మంగళవారం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 17 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మధు స్వామి కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ పొరపాటు పడ్డారు. తర్వాత నాలుక కరుచుకున్నారు.