కేజిఎఫ్ స్టార్ యష్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

కేజిఎఫ్ స్టార్ యష్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి ఫైర్

April 17, 2019

కేజీఎఫ్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ స్టార్‌ యశ్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభలో పాల్గొన్న కుమారస్వామి.. తమలాంటి నిర్మాతల వల్లే అలాంటి నటులు జీవిస్తున్నారని వ్యాఖ్యానించారు. దివంగత ఎంపీ, కన్నడ రెబల్ స్టార్ అంబరీష్‌ సతీమణి సుమలత మాండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

అదే స్థానం నుంచి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ కూడా పోటీ చేస్తున్నారు. సుమలతకు యశ్‌ మద్దతుగా ఉన్నారు. ఇటీవల నామినేషన్‌ వేయడానికి సుమలత వెళ్లినప్పుడు ఆయన కూడా ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో కుమారస్వామి తాజాగా జరిగిన సభలో యశ్‌ను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి మాట్లాడుతూ…‘మాలాంటి నిర్మాతలు లేకపోతే ఈ నటుల జీవితం ముందుకెళ్లదు. యశ్‌ లాంటి నటులు నా పార్టీ సభ్యుల్ని విమర్శిస్తున్నారు. నా కారణంగా కార్యకర్తలు కామెంట్‌ చేయకుండా మౌనంగా ఉన్నారు. ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు ఇక నేను ఒప్పుకుంటానన్న నమ్మకం నాకు లేదు. మాలాంటి నిర్మాతలు ఉండటం వల్ల వాళ్లు జీవించగలుగుతున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ నటులు ఎక్కడికి పోయారు?’ అని కుమారస్వామి ప్రశ్నించారు.