Karnataka: Drunk man pees on KSRTC bus female co-passenger seat
mictv telugu

RTC బస్సులో మహిళపై మూత్ర విసర్జన

February 23, 2023

Karnataka: Drunk man pees on KSRTC bus female co-passenger seat

గతేడాది నవంబర్ 26 న ఎయిరిండియా విమానంలో వృద్ధురాలిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిపిందే. తాజాగా అలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కెఎస్‌ఆర్‌టిసి) నడుపుతున్న బస్సులో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి హుబ్బళ్లి సమీపంలో నాన్-ఎసి స్లీపర్ బస్సులో మహిళా సహ-ప్రయాణికుల సీటుపై ఓ వ్యక్తి(32) మూత్ర విసర్జన చేశాడు. కేఏ-19 ఎఫ్-3554 నంబర్ గల బస్సు విజయపుర నుంచి మంగళూరు వెళుతోంది.

అయితే మార్గమధ్యంలో హుబ్బళ్లి సమీపంలోని కిరేసూర్‌లోని ‘ధాబా’ వద్ద ప్రయాణికుల డిన్నర్‌ కోసం బస్సు ఆపారు. 32 ఏళ్ల ఓ వ్యక్తి.. 20 ఏళ్ల మహిళ కూర్చున్న సీటుపై మూత్ర విసర్జన చేశాడని సహ ప్రయాణికుడు గాలేష్ యాదవ్ తెలిపారు.”ఆమె కేకలు వేయడంతో సహప్రయాణికులు, బస్సు సిబ్బంది ఆమెకు సహాయం చేయడానికి పరుగెత్తారు. మద్యం మత్తులో ఉన్న యువకుడిని ఆపారు. ఆ సమయంలో అతను సహ ప్రయాణికులతో, బస్సు సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించాడు.

మద్యం మత్తులో ఉన్న అతడిని అదుపు చేయలేకపోవడంతో, ప్రయాణికులు అతడిని బస్సులోనుంచి బలవంతంగా దింపేయాలని సిబ్బందిని డిమాండ్ చేశారు. అయితే, ఈ ఘటన మీద మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడకపోవడంతో, నిందితుడిని దించేసి, బస్సు ముందుకు వెళ్లింది” అని కేఎస్ఆర్ టీసీ అధికారి ఒకరు తెలిపారు. మంగళూరు సీనియర్ డివిజనల్ కంట్రోలర్ రాజేష్ శెట్టి మాట్లాడుతూ.. బస్సు మార్గమధ్యలో ‘ధాబా’ దగ్గర ఆగినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో నిందితుడు, బాధితురాలు తప్ప మరెవరూ బస్సులో లేరు. ధాబాలో భోజనం ముగించుకొని ఆ యువతి, తిరిగి సీట్లో కూర్చుండగా.. మద్యం మత్తులో ఆ వ్యక్తి ఈ పని చేశాడు. వెంటనే సిబ్బందికి సమాచారం అందించింది, వారు నేరస్థుడిని బలవంతంగా దింపేశారు” అని తెలిపారు.