‘నా కొడుకుని ఓడించారు’..మాజీ సీఎం కంటతడి - MicTv.in - Telugu News
mictv telugu

‘నా కొడుకుని ఓడించారు’..మాజీ సీఎం కంటతడి

November 27, 2019

karnataka ex cm hd Kumaraswamy Breaks Down while Campaigning

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎన్నికల ప్రచార సభలో కంటతడి పెట్టారు. ఆయన ఈరోజు మండ్య జిల్లాలోని కేఆర్‌ పేట ఉపఎన్నిక సందర్భంగా ఆ స్థానం నుంచి జేడీఎస్‌ తరపున పోటీ చేస్తున్న బీఎల్‌ దేవరాజ్‌ తరపున బుధవారం ప్రచారంలో పాల్గొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన తన కొడుకుని ఓడించి అక్కడి ప్రజలు తనను విడిచిపెట్టారని కంటతడి పెట్టుకున్నారు. నిఖిల్ సినీ నటి సుమలతపై పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెల్సిందే.

 

కుమారస్వామి మాట్లాడుతూ..’ఎంతో నమ్మకం ఉంచిన మండ్య ప్రజలు నా కొడుకుని ఓడించి నన్ను వదిలిపెట్టారు. నా కొడుకు నిఖిల్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని నేను అనుకోలేదు.. కానీ మీరు పట్టుబట్టడం వల్లే నిలబెట్టాను. నేనేం తప్పు చేశానని ఓడించారు. అయినా నా బాధంతా ఓడిపోయిన నా కొడుకు గురించి కాదు.. ఇక్కడి ప్రజల గురించే. ముఖ్యమంత్రి పదవి కన్నా మీ ప్రేమాభిమానాలే నాకు ముఖ్యం’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఏడాది జులైలో కర్ణాటక శాసనసభలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో 17 మంది ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడంతో స్పీకర్‌ వారిని అనర్హులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో విశ్వాస పరీక్షలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి అధికారాన్ని కోల్పోయింది. తరువాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి యడియూరప్ప సీఎం అయ్యారు. దీంతో ఆయా స్థానాల్లో ఖాళీ ఏర్పడింది. వాటి ఉపఎన్నికలకు ఇటీవల నోటిఫికేషన్‌ వెలువడింది. డిసెంబర్‌ 5న ఎన్నికలు జరగనున్నాయి.