బస్సులు రైట్ రైట్..4 రాష్ట్రాల జనం రావొద్దు
లాక్ డౌన్ 4 మార్గ దర్శకాల్లో భాగంగా కేంద్రం ప్రజా రవాణా అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసిన సంగతి తెల్సిందే. రాష్ట్రాల పరస్పరం ఒప్పందం మేరకు బస్సులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నడపొచ్చని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల రవాణాకు అనుమతి ఇచ్చింది.
ఈ సందర్భంగా సీఎం యడియూరప్ప మాట్లాడుతూ..'బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయిస్తాం. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు అవుతాయి. ఇతర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు అనుమతించబడుతాయి. ఆదివారం రోజు రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. హోం క్వారంటైన్‌ను మరింత బలోపేతం చేస్తాం. అన్ని దుకాణాలు తెరువబడుతాయి. రాష్ట్ర పరిధిలో అన్ని రైళ్లు నడుస్తాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళకు చెందిన ప్రజలు కర్ణాటకలోకి అనుమతించబడరు.' అని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల రాష్ట్రంలో 30 మంది మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 84 కరోనా కేసులు నమోదయ్యాయి.