చైనాలో విలయతాండవం చేస్తున్న కరోనా పట్ల భారత్ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు తప్పనిసరి పరీక్షలు చేస్తుండడంతో పలు విమానాశ్రయాల్లో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. డిసెంబర్ 24న బెంగళూరు ఎయిర్ పోర్టులో 2867 మందికి పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్ అని తేలడంతో వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపారు. ఈ ఘటనతో కర్ణాటక ప్రభుత్వం మాస్కులను ధరించడం తప్పనిసరి చేసింది. న్యూఇయర్ వేడుకల్లో కూడా మాస్కులు ధరించాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ కోరారు.
కోల్ కతా విమానాశ్రయంలో రెండు కేసుల్ని గుర్తించారు. వీరిలో ఒకరు కౌలాలంపూర్, మరొకరు మలేషియా నుంచి రాగా, శాంపిల్స్ సేకరించి ల్యాబుకు పంపారు. బీహార్ లని గయ ఎయిర్ పోర్టులో నలుగురు విదేశీయులకు కరోనా సోకింది. వీరిలో ఒకరు బ్యాంకాక్, ముగ్గురు మయన్మార్ నుంచి రాగా, ఐసోలేషన్ కి పంపినట్టు అధికారులు తెలిపారు. ఇక దేశంలో ఆదివారం మొత్తం కరోనా కేసులు 198 నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3428కగా, రికవరీ రేటు 98.8 శాతంగా ఉండడంతో ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అటు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ భారతీయ వైద్య మండలి సభ్యులతో దేశంలో కరోనా పరిస్థితి, ఎదుర్కొనే తీరుపై చర్చిండానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.