Karnataka High Court quashed Suresh's life sentence
mictv telugu

భార్యను చంపిన భర్తకు శిక్ష రద్దు చేసిన హైకోర్టు.. కారణం ఏంటంటే

October 19, 2022

చిన్న తప్పు చేసి దొరికిపోతే న్యాయస్థానాలు శిక్షలు విధిస్తుంటాయి. అత్యాచారం, హత్యలు వంటి సీరియస్ నేరాలకైతే కఠిన కారాగార శిక్షలతో పాటు అదనంగా జరిమానాలు విధిస్తుంటాయి. కానీ, ఇక్కడు మనం చెప్పుకోబోయే కేసులో మాత్రం ఓ భర్త తన భార్యను కొట్టి చంపినా శిక్ష వేయలేదు. నేరం రుజువై క్రింది కోర్టు నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించినా హైకోర్టు దానిని కొట్టివేసింది. పైగా ఎలాంటి శిక్ష వేయకుండా విడుదల చేయాలని ఆదేశించింది. సంచలనంగా మారిన ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరెలో భర్త సురేశ్ తన భార్య రాధతో కలిసి జీవిస్తున్నాడు.

2016లో వినాయక చవితి సందర్భంగా రాధ వంట చేయకుండా మద్యం తాగి పడుకుంది. ఇంటికి వచ్చిన భర్త పరిస్థితిని చూసి కోపం పట్టలేక కర్రతో దాడి చేయగా, దెబ్బ గట్టిగా తగలడంతో రాధ అక్కడికక్కడే మరణించింది. దీంతో 2017లో స్థానిక కోర్టు సురేశ్‌కి హత్యానేరం కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పట్నుంచి సురేశ్ జైల్లోనే ఉన్నాడు. అయితే తర్వాత సురేశ్ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయగా, మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్ కే. సోమశేఖర్, టీజీ శివశంకర గౌడలతో కూడిన ధర్మాసనం విచారించింది. సురేశ్ ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని, ఈ నేరాన్ని హత్యగా భావించలేమని పేర్కొంది. అంతేకాక, హత్యానేరం సెక్షన్ తొలగించాలని, ఇప్పటికే ఆరేళ్లు జైలు శిక్ష అనుభవించిన కారణంగా వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే నిందితుడిపై వేరే ఎలాంటి కేసులు లేకపోవడంతో తీర్పును తక్షణమే అమలు పరచాలని ఆదేశించింది.